Wed Oct 16 07:40:00 UTC 2024: ## విజ‌యా డెయిరీ చైర్మ‌న్ ఎస్వీ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అఖిల‌ప్రియ‌పై తీవ్ర విమ‌ర్శ‌లు

నంద్యాల: ఆళ్ల‌గ‌డ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల‌ప్రియ‌కు సంస్కారం లేద‌ని విజ‌యా డెయిరీ చైర్మ‌న్‌, ఆమె మేన‌మామ ఎస్వీ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

నంద్యాల‌లోని విజ‌యా డెయిరీ కార్యాల‌యానికి అఖిల‌ప్రియ వెళ్లి, చైర్మ‌న్ సీట్లో కూచుని మీడియా ఎదుట హ‌డావుడి చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో అఖిల‌ప్రియ‌పై ఎస్వీ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. త‌న కార్యాల‌యానికి అనుమ‌తి లేకుండా రావ‌డ‌మే కాకుండా, త‌న సీట్లో కూచున్న అఖిల‌ప్రియ‌ను విజ్ఞ‌త‌కే వ‌దిలి పెడ్తున్నానని, ఆ కుర్చీనే తీసేశానని ఆయ‌న చెప్పారు.

అఖిల‌ప్రియ చేసింది త‌ప్పు అని, త‌న ఇంట్లోకి వ‌చ్చి కుర్చీలో కూచుంటే ఎలా వుంటుంది? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. విజ‌య‌డెయిరీ స్వ‌తంత్ర సంస్థ అని, ప్ర‌భుత్వంతో ఎలాంటి సంబంధం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

చంద్ర‌బాబు ఫొటో త‌న కార్యాల‌యంలో ఉన్నందుకు అఖిల‌ప్రియ‌కు అభ్యంతరం ఉంటే తీసేయ‌వ‌చ్చ‌ని, కానీ చంద్ర‌బాబు త‌మ‌కు సీఎం అని, గౌర‌వంగా ఆ ఫొటోనే అట్లే ఉంచుతా అని ఎస్వీ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తెలిపారు.

త‌న‌కు ప‌ద‌వి ఇచ్చిన జ‌గ‌న్ అభిమానాన్ని ఎలా మ‌రిచిపోతాన‌ని, మ‌నిష‌న్న త‌ర్వాత విశ్వాసం వుండ‌దా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

అఖిల‌ప్రియ‌పై కేసు పెట్ట‌కూడ‌ద‌ని అనుకున్న‌ట్టు చెప్పిన ఎస్వీ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, తాము వ్యాపారాలు చేసుకునే వాళ్ల‌మ‌ని, ఇలాంటి మాన‌సిక ఆందోళ‌న‌లు అవ‌స‌రం లేద‌ని, అఖిల‌ప్రియ‌కు కేసులు అల‌వాట‌య్యాయ‌న్నారు.

త‌మ కుటుంబానికి అలాంటివి తెలియ‌ద‌ని, త‌న తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డికి రౌడీయిజం తెలియ‌ద‌ని, ఎస్వీ నాగిరెడ్డి ఫొటో ముట్టుకున్న అఖిల‌ప్రియ‌కు ఆ క్ష‌ణ‌మే ప‌త‌నం ప్రారంభ‌మైంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

కేవ‌లం సీఎం చంద్ర‌బాబునాయుడి మెహ‌ర్బానీ కోస‌మే అఖిల‌ప్రియ నంద్యాల‌లో త‌మ కార్యాల‌యానికి వ‌చ్చి హ‌డావుడి చేసింద‌ని, చంద్ర‌బాబుకు అఖిల‌ప్రియ గురించి అన్నీ తెలుస‌ని, నాలుగు నెల‌ల్లో అఖిల‌ప్రియ ఏం చేశారో చంద్ర‌బాబు ద‌గ్గ‌ర చిట్టా వుంద‌ని ఆయ‌న చెప్పారు.

ఇదంతా త‌న త‌మ్ముడు జ‌గ‌త్‌విఖ్యాత్ కోసం అఖిల‌ప్రియ చేస్తున్నార‌ని, విజ‌యా డెయిరీ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి త‌న‌ను దించి, త‌న త‌మ్ముడిని ఎక్కించాల‌ని ఆమె ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఎస్వీ జ‌గ‌న్ ఆరోపించారు.

గ‌తంలో అఖిల‌ప్రియ అబ్బ నారాయ‌ణ‌రెడ్డినే ప‌ద‌వి కోసం త‌న్నార‌ని, ఇక మేన‌మామ అయిన తానెంత అని ఆయ‌న ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌జాస్వామ్య బ‌ద్ధంగా వెళ్లాల‌ని, ఇత‌రుల కుర్చీల్లో కూచుంటే, అంద‌రూ త‌న‌లాగా ఊరికే ఉండ‌ర‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

అఖిల‌ప్రియ వ‌ల్ల మ‌రో ఆళ్ల‌గ‌డ్డ‌లా ప్ర‌శాంత‌మైన నంద్యాల త‌యార‌వుతుంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

Read More