Mon Oct 14 08:43:06 UTC 2024: ## హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా అతిపెద్ద ఐపీవో ద్వారా రికార్డు సృష్టించనుంది

న్యూఢిల్లీ: భారత స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో అతిపెద్ద ఐపీవోగా హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 15న ప్రారంభంకానుంది. 2003లో జపనీస్‌ అగ్రగామి మారుతీ సుజుకీ ఐపీవో తర్వాత మరో టాప్‌ ఆటోమొబైల్‌ సంస్థ లిస్ట్‌ కానుంది. ఈ ఇష్యూలో భాగంగా ప్రమోటర్‌ సంస్థ హ్యుందాయ్‌ మోటార్‌ కంపెనీ 14,21,94,700 షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా 3.3 బిలియన్‌ డాలర్లు(రూ. 27,870 కోట్లు) సమీకరించాలని భావిస్తోంది. దీంతో 2022 మే నెలలో బీమా దిగ్గజం ఎల్‌ఐసీ రూ. 21,000 కోట్లు సమీకరించిన ఇష్యూని అధిగమించనుంది. లిస్టింగ్‌ తదుపరి కంపెనీ మార్కెట్‌ విలువ 19 బిలియన్‌ డాలర్ల (రూ.1.6 లక్షల కోట్లు)కు చేరనుంది.

దేశీయంగా కార్ల తయారీ, అమ్మకాలలో మారుతీ సుజుకీ తదుపరి హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా రెండో ర్యాంకులో నిలుస్తున్న సంగతి తెలిసిందే. 2025 జనవరి–మార్చి కాలంలో క్రెటా ఈవీని ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు హెచ్‌ఎంఐఎల్‌ పేర్కొంది. రానున్న కొన్నేళ్లలో మరో 4 ఈవీలను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. 1996లో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ వివిధ విభాగాలలో 13 మోడళ్లను విక్రయిస్తోంది. ప్రపంచంలోనే ఇండియా అత్యంత ఆసక్తికరమైన మార్కెట్‌గా కంపెనీ ఎండీ, సీఈవో అన్సూ కిమ్‌ ఐపీవో రోడ్‌షో సందర్భంగా పేర్కొన్నారు. ఐపీవో ద్వారా కంపెనీ బ్రాండ్‌ మరింత మందికి చేరువవుతుందని ఆయన అన్నారు.

Read More