Wed Oct 02 10:20:56 UTC 2024: ## బాబర్ అజామ్ పాకిస్థాన్ కెప్టెన్సీకి గుడ్‌బై!

పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజామ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే టెస్టు ఫార్మట్ కెప్టెన్సీని వదులుకున్న బాబర్ తాజాగా వన్డే, టీ20 నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. తన నిర్ణయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు కూడా తెలిపినట్లు చెప్పాడు.

“పాకిస్థాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం దక్కడం నాకు ఎంతో గౌరవం,” అని బాబర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. “కానీ, ఈ బాధ్యత నాపై పనిభారం పెంచుతుంది. నేను పూర్తిగా బ్యాటింగ్ పై దృష్టి పెట్టాలనుకుంటున్నా. అలాగే నా కుటుంబంతో సమయం గడపాలనుకుంటున్నా. అందుకే కెప్టెన్సీ వదులుకుంటున్నా. ఓ ప్లేయర్గా పాకిస్థాన్ క్రికెట్‌కు నా అత్యుత్తమ ప్రదర్శనను అందిస్తాను.”

బాబర్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో స్థానం కోల్పోయిన కాసేపటికే తన నిర్ణయాన్ని ప్రకటించడం విశేషం. ఇక ఏడాదిలో బాబర్ కెప్టెన్సీ వదులుకోవడం ఇది రెండోసారి. గతేడాది నవంబర్లో బాబర్ ఆజామ్ టెస్టు ఫార్మాట్ కెప్టెన్సీని వదులుకున్నాడు.

బాబర్ 2019లో తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. అప్పటి నుంచి పాకిస్థాన్ జట్టును అన్ని ఫార్మాట్లలో సమర్థంగా నడిపించాడు. బాబర్ కెప్టెన్సీలో పాకిస్థాన్ మూడు ఫార్మాట్లలో 84 మ్యాచ్లు గెలిచింది. పాక్ క్రికెట్‌లో రెండో అత్యత్తమ కెప్టెన్‌గానూ నిలిచాడు. కానీ, గత ఏడాదిగా పాకిస్థాన్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్, 2024లో జరిగిన టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైంది.

Read More