Sat Sep 28 05:04:29 UTC 2024: ## వర్షం కారణంగా టీమిండియా-బంగ్లాదేశ్ రెండో టెస్టు ఆట ఆలస్యం

కాన్పూర్: భారత్-బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో శనివారం వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభం కానుంది. టీమిండియా తొలి రోజు 35 ఓవర్లలో బంగ్లాదేశ్‌ను 107 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టింది. అయితే, వర్షం కారణంగా పిచ్‌ చిత్తడిగా మారడంతో ఆట ఆలస్యం అవుతోంది.

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్‌తో స్వదేశంలో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతోంది. తొలిరోజు కూడా వర్షం ఆటకు అంతరాయం కలిగించింది.

మొదటి రోజు ఆకాశ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఓపెనర్‌ జకీర్‌ హసన్‌(0)ను భారత పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ డకౌట్‌ చేశాడు. మరో ఓపెనర్‌ షాద్‌మన్‌ ఇస్లాం(24) వికెట్‌ను కూడా ఆకాశ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్‌ నజ్ముల్‌ షాంటో(31)ను స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. శుక్రవారం ఆట ముగిసే సమయానికి వన్‌డౌన్‌ బ్యాటర్‌ మొమినుల్‌ హక్‌ 40, ముష్ఫికర్‌ రహీం 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.

భారత్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌ రెండో టెస్టు తుదిజట్లు:

టీమిండియా: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్‌ పంత్(వికెట్ కీపర్‌), కేఎల్‌ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌ దీప్, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్ సిరాజ్

బంగ్లాదేశ్: షాద్‌మన్‌ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్‌), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్‌కీపర్‌), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్.

Read More