Wed Nov 13 02:30:00 UTC 2024: ## బీఆర్‌ఎస్‌ నేతలను అరెస్ట్‌ చేయడంపై తీవ్ర నిరసన: కేటీఆర్‌, హరీష్‌ రావు

**సాక్షి, హైదరాబాద్‌:** లగచర్ల ఘటనలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయడాన్ని బీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్ట్‌ రేవంత్‌ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నరేందర్‌ రెడ్డి అరెస్ట్‌ను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా తీవ్రంగా ఖండించారు. “పట్నం నరేందర్‌ రెడ్డి అరెస్ట్‌ రేవంత్‌ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్‌ఎస్‌కు ఆపాదించే కుట్రకార్యకర్తలతో మాట్లాడిన కూడా ప్రజా ప్రతినిధులను అరెస్ట్‌ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది. ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారు,” అని కేటీఆర్‌ ఆరోపించారు.

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులను అక్రమ కేసులు, అరెస్ట్‌లతో భయపెట్టాలని చూస్తుందని, అది మూర్ఖపు చర్య అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. “రేవంత్‌ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఉద్యమకాలం నుంచి బీఆర్‌ఎస్‌ ఇలాంటి నిర్బంధాలు, అక్రమ అరెస్ట్‌లు ఎన్నో చూసింది. ఎంత అణిచివేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తాం. పట్నం నరేందర్‌ రెడ్డి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నా. వెంటనే ఆయనను, లగచర్లలో అరెస్ట్‌ చేసిన రైతులను విడుదల చేయాలి” అని డిమాండ్‌ చేశారు.

మాజీ మంత్రి హరీష్‌ రావు కూడా నరేందర్‌ రెడ్డి అరెస్ట్‌ను ఖండించారు. “నరేందర్‌ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటు. పచ్చని పొలాల్లో ఫార్మా సిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలనా?. నడి రాత్రి రైతులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌లో పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా?. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణిచివేయలేరు. మీ బెదిరింపులకు బీఆర్‌ఎస్‌ పార్టీ భయపడదు. ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని ఎండగడతం. ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటాం. అరెస్ట్‌ చేసిన పట్నం నరేందర్‌ రెడ్డి, రైతులను వెంటనే విడుదల చేయాలి” అని హరీష్‌ రావు డిమాండ్‌ చేశారు.

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా నరేందర్‌ రెడ్డి అరెస్ట్‌ను ఖండిస్తూ, “ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు ప్రజల గొంతుకై ప్రశ్నించడం ప్రతిపక్షాల యొక్క బాధ్యత. సమస్యలకు పరిష్కారం ఆలోచించకుండా ప్రతిపక్ష నాయకులను వేధించడం ప్రభుత్వ పనిగా మారింది. ప్రభుత్వం బాధ్యతని మరిచినప్పుడు ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది, అది తప్పా?” అని ప్రశ్నించారు.

Read More