Wed Nov 06 02:48:47 UTC 2024: ## అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఆలస్యంగా వెల్లడయ్యే అవకాశం

**వాషింగ్టన్‌:** అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఈసారి ఆలస్యంగా వెల్లడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ పరిశీలకులు, స్పష్టమైన చిత్రం ఆవిష్కృతమవ్వడానికి రెండు, మూడు రోజులు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు.

మనదేశంలో లాగా అమెరికాలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఉండదు. ఓట్ల లెక్కింపు బాధ్యత రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలదే. 50 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఒకేలా ఉండదు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. డెమొక్రాటిక్‌ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య హోరాహోరీ పోరు సాగిన నేపథ్యంలో ఫలితాల వెల్లడికి సమయం పట్టే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

పోలింగ్‌ ముగిసిన కొద్ది గంటల్లో అమెరికా మీడియా సంస్థలు ఎవరు ఆధిక్యంలో ఉన్నారనే విషయాన్ని వెల్లడిస్తాయి. అమెరికన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఫలితాల కోసం వీటిపైనే ఆధారపడతారు. అమెరికాలో ఆరు కాలమానాలున్నాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం 11:30 గంటలకు అమెరికావ్యాప్తంగా పోలింగ్‌ ప్రక్రియ ముగుస్తుంది. అంటే బుధవారం రాత్రికల్లా ఫలితాల ట్రెండ్స్‌ ఎలా ఉన్నాయనేది తెలిసే అవకాశం ఉంటుంది.

చాలా రాష్ట్రాల్లో అవి ఎటువైపు మొగ్గుతాయనేది ముందు నుంచే తెలిసి ఉంటుంది. సులభంగా అంచనా వేయవచ్చు. ఈ రాష్ట్రాల్లో ఫలితాలు తొందరగానే వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేది ఏడు స్వింగ్‌ రాష్ట్రాలు. వీటిలో ఫలితాలు వెల్లడైతే గాని ఉత్కంఠకు తెరపడదు. హోరాహోరీ పోరు దృష్ట్యా స్వింగ్‌ రాష్ట్రాలు.. ముఖ్యంగా పెన్సిల్వేనియా తదుపరి అధ్యక్షుడు ఎవరనేది నిర్ణయించనున్నాయి.

ఏడు స్వింగ్‌ రాష్ట్రాల్లో కలిపి 93 ఎలక్టోరల్‌ కాలేజీలు ఉన్నాయి. ఈ స్వింగ్‌ రాష్ట్రాలు స్వల్ప ఆధిక్యంతో ఏదైనా పార్టీ ఖాతాలో పడొచ్చు. అప్పుడు రీకౌంటింగ్‌ అవసరమవుతుంది. అప్పుడు ఫలితాల వెల్లడి మరింత ఆలస్యమవుతుంది.

2020లో నవంబరు 3న ఎన్నికలు జరగగ్గా… ఫలితం తేలడానికి నాలుగు రోజులు పట్టింది. పెన్సిల్వేనియాలో ఫలితం స్పష్టమయ్యాక.. జో బైడెన్‌ నెగ్గారని మీడియా ప్రకటించింది.

Read More