Tue Nov 05 00:40:00 UTC 2024: ## చంద్రబాబు మంత్రి వాసంశెట్టి సుభాష్‌పై ఆగ్రహం!

రాజమహేంద్రవరం: పట్టభద్రుల ఓట్ల నమోదును సీరియస్‌గా తీసుకోవడం లేదని మంత్రి వాసంశెట్టి సుభాష్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వెలిబుచ్చారు.

“మొదటిసారి గెలిచిన మిమ్మల్ని పార్టీ ఎంతో గౌరవించింది. ఎమ్మెల్యే సీటు ఇచ్చి.. గెలిచాక మంత్రిని చేశాం.. అయినా పట్టుదల లేకపోతే ఎలాగయ్యా? మీరు సరిగా పనిచేయకపోతే నేను సీరియస్‌గా ఆలోచిస్తా.. పార్టీకి ఉపయోగపడకపోతే మీకు రాజకీయాలెందుకయ్యా?” అని చంద్రబాబు మండిపడ్డారు.

పట్టభద్రుల ఎన్నికల ఓట్ల నమోదుపై ఆదివారం సాయంత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మంత్రులు, ఇన్‌ఛార్జి మంత్రులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్‌ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

“రామచంద్రపురం నియోజకవర్గంలో 9వేలకు గాను 2,630 ఓట్లు నమోదు చేశారు. 29% మాత్రమే అయింది. నిన్న(శనివారం) కూడా 319 ఓట్లు మాత్రమే నమోదు చేశారు.. నువ్వు యువకుడివి. మొదటి సారి ఎమ్మెల్యే.. రాజకీయాలపై సీరియస్‌నెస్‌ లేదు. ఓట్ల నమోదులో మీ నియోజకవర్గం ఎక్కడుందో చూసుకున్నారా?” అని ప్రశ్నించారు.

“మిమ్మల్నందరినీ ఒత్తిడి చేస్తున్నాననుకోవద్దు. నా బాధ్యత నేను చేస్తున్నా. మీ బాధ్యత మీరు చేయండి. ఏ ఎన్నిక వచ్చినా ఎమ్మెల్యేలు తమను తాము నిరూపించుకోవాలి. రోజూ మీకు పరీక్షే. లేదంటే నేను ప్రత్యామ్నాయం ఆలోచిస్తా. అంచనాల మేరకు పనిచేయడం లేదని ప్రజలకే చెబుతా” అని చంద్రబాబు హెచ్చరించారు.

పనితీరు బాగాలేదంటూ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌పైనా ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఓటరు నమోదులో వేగం పెంచాలని, మంత్రులంతా క్రియాశీలకంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు.

Read More