Sun Oct 13 11:30:04 UTC 2024: ## ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూశారు

**హైదరాబాద్**: మావోయిస్టు సానుభూతిపరుడు, రచయిత, మానవ హక్కుల కార్యకర్త, ఢిల్లీ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యుడు ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా మంగళవారం కన్నుమూశారు. పదేళ్ల జైలు జీవితం అనంతరం బెయిల్‌పై విడుదలైన ఆయన, అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

సాయిబాబా మృతికి వివిధ రాజకీయ పక్షాలతోపాటు మావోయిస్టు సానుభూతిపరులు, మానవ హక్కుల కార్యకర్తలు, మేధావులు సంతాపం ప్రకటించారు. దసరా పండుగ రోజే ఆయన మరణించడం తీవ్ర విషాదం నింపింది.

ప్రొఫెసర్ సాయిబాబా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పని చేస్తున్న సమయంలో మావోయిస్టులతో సత్సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు రావడంతో పోలీసులు అరెస్ట్ చేసి అతడిని దాదాపు పదేళ్ల పాటు జైలులో నిర్బంధించారు. జీవిత కాల జైలు శిక్ష పొందిన ఆయనకు బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌ ఈ ఏడాది మార్చ్‌లో నిర్దోషిగా తీర్పునిచ్చింది. ఆయనతోపాటు మరో నలుగురిని నిర్దోషులుగా విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని పేద రైతు కుటుంబంలో 1967లో జన్మించిన సాయిబాబా, పోలియో కారణంగా ఐదేళ్ల వయసులోనే వీల్‌ చైర్‌కు పరిమితమయ్యారు. ఉన్నత చదువులు చదివిన ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రామ్‌ లాల్‌ ఆనంద్‌ కళాశాలలో ఆంగ్ల ఆచార్యుడిగా విధులు నిర్వర్తించారు. సామాజిక అంశాలపై స్పందిస్తూ అనేక రచనలు చేసిన ఆయన, మానవ హక్కుల కోసం ఉద్యమాలు చేస్తుండేవారు. మావోయిస్టులతో సత్సంబంధాలు ఉన్నాయనే కారణంతో మహారాష్ట్ర పోలీసులు 2014లో ప్రొఫెసర్‌ సాయిబాబాను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Read More