Sat Oct 12 00:20:00 UTC 2024: ## కేసీఆర్ దసరా శుభాకాంక్షలు: ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్ష

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ మంచి కోసం నిత్యపోరాటం చేయాలనే జీవన తాత్వికతను విజయదశమి గుర్తుచేస్తుందని అన్నారు.

దసరా నాడు పాలపిట్టను దర్శించి, శమీవృక్షానికి పూజ చేసి, జమ్మి ఆకును బంగారంలా భావించి పెద్దలకు సమర్పించుకుని వారి ఆశీర్వాదం తీసుకోవడం, గొప్ప భారతీయ సాంస్కృతిక ఆచారమని కేసీఆర్‌ గుర్తుచేశారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరా పండుగకు ప్రత్యేక స్థానమున్నదని తెలిపారు. అలయ్‌ -బలయ్‌ తీసుకుని పరస్పర ప్రేమాభిమానాలను పంచుకోవడం ద్వారా ప్రజల నడుమ సామాజిక సామరస్యం పరిఢవిల్లుతుందని పేర్కొన్నారు.

దసరా సందర్భంగా ప్రజలు తాము నిర్వర్తించే వృత్తులకు సంబంధించిన పరికరాలు, వినియోగించే వాహనాలను ఆయుధ పూజ చేసి గౌరవించుకునే గొప్ప సంప్రదాయాన్ని కూడా కేసీఆర్‌ ప్రస్తావించారు. పాలపిట్టను రాష్ట్రపక్షిగా, జమ్మిచెట్టును రాష్ట్ర వృక్షంగా గుర్తించడంతో పాటు దసరా పండుగ విశిష్టతను చాటే దిశగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేండ్ల పాలనలో పలు కార్యక్రమాలు చేపట్టిందని కూడా ఆయన గుర్తుచేశారు.

తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని, తాము ఎంచుకున్న సమున్నత లక్ష్యాలను చేరుకుని విజయం సాధించేలా దసరా సందర్భంగా కేసీఆర్‌ ప్రార్థించారు.

Read More