Tue Oct 08 22:03:57 UTC 2024: ## దివీస్ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి
విశాఖపట్నం: భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ సిటీనగర్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దివీస్ ఉద్యోగి శేశెట్టి రాంబాబు దుర్మరణం చెందారు. నైట్ డ్యూటీకి వెళ్లి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ముందున్న ట్రాక్టర్‌ను దాటి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా ఎదురుగా వస్తున్న లారీకి దూరంగా వెళ్లడానికి ప్రయత్నిస్తూ ట్రాక్టర్ వెనుక భాగం తగిలి రోడ్డుపై పడిపోయారు. తలకు తీవ్ర రక్తస్రావం కాగా అక్కడికక్కడే మృతి చెందారు.
తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన మృతుడు ఏడేళ్ల క్రితం దివీస్‌లో చేరారు. ప్రస్తుతం జీవీఎంసీ భీమిలి జోన్ ఒకటో వార్డు బాలాజీనగర్‌లో నివసిస్తున్నారు. ఆయనకు భార్య, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. భీమిలి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆయన స్వగ్రామానికి తరలించారు. ఆయన మృతితో తోటి ఉద్యోగులు దుఃఖంలో మునిగిపోయారు.