Sun Sep 22 20:12:54 UTC 2024: ## మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ వరల్డ్ రికార్డు!
హైదరాబాదులోని ఒక స్టార్ హోటల్లో ఈరోజు మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ వరల్డ్ రికార్డు అవార్డు అందజేయబోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఈ అవార్డును అందించనున్నారు.
చిరంజీవి 150కు పైగా సినిమాల్లో నటించి, అన్ని చిత్రాల్లో డ్యాన్స్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు తెలుస్తోంది. ఇతర నటులు ఇంత కంటే ఎక్కువ చిత్రాల్లో నటించినా.. అన్ని చిత్రాల్లో డ్యాన్స్ చేయలేదనీ అంటున్నారు. ఈ విషయంలోనే చిరూకు గిన్నిస్ రికార్డు దక్కనుందని ప్రచారం జరుగుతోంది.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిథులతో పాటు ఆమిర్ ఖాన్ హైదరాబాద్‍కు వచ్చారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి పేరు అధికారికంగా గిన్నిస్ బుక్‍లో ఎక్కిన విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు.
ఈ ఏడాది మొదట్లోని దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‍ను మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికొస్తే ఆయన వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరా అనే సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా పదో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.