Sun Sep 22 19:12:50 UTC 2024: ## మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్!

**హైదరాబాద్:** భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత సక్సెస్ ఫుల్ చలనచిత్ర నటుడు, డాన్సర్ గా మెగాస్టార్ చిరంజీవి కొణిదెలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. “మోస్ట్ ప్రోలిఫిక్ ఫిలిమ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ” కేటగిరీలో ఆయన పేరు గిన్నీస్ బుక్ లోకి ఎక్కింది.

1978 సెప్టెంబర్ 22న మెగాస్టార్ సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. 46 సంవత్సరాల కాలంలో తన 156 సినిమాల్లో 537 పాటల్లో 24000 డ్యాన్స్ మూవ్స్ చేసినట్టు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదయింది.

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో నటించడం మొదలుపెట్టినప్పటి నుంచే ఆయన డాన్స్ గురించి కూడా ప్రత్యేకంగా చర్చలు జరిగేవి. ఎందుకంటే అప్పటికి ముందు తరం నటుల పీరియడ్ లో డాన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. కానీ మెగాస్టార్ చిరంజీవి తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు.

చిరు వేసే డ్యాన్సులకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. డ్యాన్సులకు చిరంజీవి అడ్రస్‌లాంటి వారని చెప్పాల్సిన పని లేదు. తెలుగు రాష్ట్రాల్లో డ్యాన్స్ అంతగా ఫేమస్ అవ్వడానికి 80, 90లలో చిరు చూపించిన గ్రేస్, వేసిన స్టెప్పులే కారణం.

తన డాన్స్ ని ఎంత పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేస్తాడో దాని కోసం ఎంత కష్టపడతారో తెలిపేందుకు ఒక ఉదాహరణ ఉంది. “తోడుదొంగలు” సినిమాలో కృష్ణతో కలిసి డాన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పాట క్యాసెట్ తెచ్చి పెట్టినట్టయితే నేను ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ గా చేసే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారట. ఆ రాత్రంతా మెగాస్టార్ చిరంజీవి నిద్రపోకుండా ఆ డాన్స్ కి ప్రాక్టీస్ చేసి ఉదయాన్నే సూపర్ స్టార్ కృష్ణతో కలిసి స్టెప్పులేసి భళా అనిపించారట..

ఈరోజు తెలుగు ప్రజలందరూ అన్నయ్య అని ఆరాధించే స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఆయన పోర్ట్ఫోలియోలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ గా కూడా మరో కలికితురాయి వచ్చి చేరింది. కంగ్రాట్స్ మెగాస్టార్ చిరంజీవి!

Read More