Sun Nov 10 06:47:43 UTC 2024: ## ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఢిల్లీ గణేశ్ కన్నుమూశారు
**చెన్నై:** ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఢిల్లీ గణేశ్ శనివారం రాత్రి 11.30 గంటలకు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 400కిపైగా సినిమాల్లో నటించిన ఢిల్లీ గణేశ్ చివరగా కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాలో కనిపించారు. అంతకుముందు తెలుగులో జైత్రయాత్ర, నాయుడమ్మ, పున్నమినాగు తదితర సినిమాల్లో నటించారు.
1944, ఆగస్ట్ 1న తమిళనాడులోని తిరునెల్వెలిలో జన్మించిన ఢిల్లీ గణేశ్ అసలు పేరు గణేశన్. 1976లో కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘పట్టిన ప్రవేశం’ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యారు. 1981లో ‘ఎంగమ్మ మహారాణి’ చిత్రంలో హీరోగా నటించారు.
1964 నుంచి 1974 వరకు భారత వైమానిక దళంలో పనిచేసిన ఢిల్లీ గణేశ్ సినిమాలపై ఉన్న ఆసక్తితో ఆ ఉద్యోగం వదిలేసి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. కెరీర్ మొదట్లో దక్షిణ భారత నాటక సభ (DBNS) థియేటర్ గ్రూప్ సభ్యుడిగా పనిచేశారు. ఆయనకు కె.బాలచందర్ ‘ఢిల్లీ గణేశ్’ అని నామకరణం చేశారు. 1979లో తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్న ఆయన, 1994లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత చేతుల మీదుగా కలైమామణి పురస్కారాన్ని అందుకున్నారు.
ఢిల్లీ గణేశ్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.