Fri Oct 11 22:17:24 UTC 2024: ## విజయదశమి – విజయానికి నాంది
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా చివరి రోజు, అంటే విజయదశమి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో దర్శమివ్వనున్నారు.
తెలుగు రాష్ట్రాలలో విజయదశమి అతి పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో దుర్గా పూజ పేరుతో నవరాత్రులు ఘనంగా జరుగుతాయి.
విజయదశమి పండుగను పరాజయమన్నది ఎరుగని అపరాజితా దేవి అవతరించిన రోజుగా భావిస్తారు. త్రిశక్తి స్వరూపమైన ఈ దేవిని పూజిస్తే, పరాజయం ఉండదని నమ్మకం. మధు, కైటభులను రాక్షసులను సంహరించి ప్రజలకు సుఖఃశాంతులను అందించినది కూడా ఈ రోజే!
విజయదశమి సర్వ విజయాలకు నాంది. ఈ రోజు ఏ పనిని ప్రారంభించినా విజయం తధ్యం అని నమ్ముతారు. విజయదశమి రోజునే శ్రీరాముడు లోకకంటకుడైన రావణ సంహారం చేసాడు. అందుకే ఈ రోజు ప్రజలు శ్రీరాముని విజయానికి సంకేతంగా రావణ దహనం కూడా చేస్తారు.
కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయాన్ని సాధించిన రోజు కూడా విజయదశమి అని చెబుతారు. ధర్మరాజు శకునితో మాయా జూదంలో పరాజయం పాలైన తర్వాత పాండవులు పన్నెండేళ్లు అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయాల్సివచ్చింది. అప్పుడు పాండవులు అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసం కోసం విరాటరాజు కొలువులోకి ప్రవేశించేముందు శమీ చెట్టుపై తమ ఆయుధాలను దాచి ఉంచారు. తిరిగి సంవత్సరం తరువాత పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై నుండి తిరిగి తీసుకున్నదే ఈ విజయదశమి రోజునే!
విజయదశమి పండుగ రోజు సాయంత్రం శమీ చెట్టును పూజించి, ఆ చెట్టు ఆకులు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవడం ఆచారం. శమీ ఆకులు విజయానికి సంకేతం. బహిరంగంగా జరిగే రావణ దహనాన్ని తిలకిస్తే మంచిది. ఈ రోజు పాలపిట్టను చూడడం కూడా శుభ సంకేతంగా భావిస్తారు.
పండుగలు మన సంప్రదాయానికి ప్రతీకలు. పండుగ పది గండాలు పోగొడుతుంది. మనకు ఉన్నంతలో పండుగ చేసుకోవాలి. మన పిల్లలకు మన పండుగల గొప్ప తనాన్ని తెలియజేయాలి. మన సాంప్రదాయ విలువలను మన భావితరాలకు భద్రంగా అందించాలి.
మనమందరం కూడా విజయదశమి పండుగను ఆనందంగా జరుపుకుందాం. ఆ విజయదుర్గ అనుగ్రహంతో సకల విజయాలను పొందుదాం. శ్రీమాత్రేనమః